23 May 2021 TELUGU Murli Today – Brahma Kumaris

May 22, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘హృదయపూర్వకంగా జ్ఞానీ మరియు స్నేహీగా అవ్వండి మరియు లీకేజిని సమాప్తం చేయండి’’

♫ వినండి ఆడియో (audio)➤

ఈ రోజు స్నేహసాగరుడైన బాప్ దాదా తమ స్నేహీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈ ఆత్మిక స్నేహం, పరమాత్మ స్నేహం – నిస్వార్థమైన సత్యమైన స్నేహము. ఈ సత్యమైన హృదయపూర్వకమైన స్నేహం ఆత్మలైన మీ అందరినీ పూర్తి కల్పమంతా స్నేహీలుగా చేస్తుంది ఎందుకంటే పరమాత్మ స్నేహం, ఆత్మిక స్నేహం, అవినాశీ స్నేహం – ఈ ఆత్మిక స్నేహం బ్రాహ్మణ జీవితానికి పునాది. ఆత్మిక స్నేహం యొక్క అనుభవం లేదంటే బ్రాహ్మణ జీవితం యొక్క సత్యమైన ఆనందం లేనట్లు. పరమాత్మ స్నేహం ఎలాంటి పతిత ఆత్మనైనా పరివర్తన చేసే అయస్కాంతము మరియు పరివర్తన అయ్యేందుకు సహజ సాధనము. స్నేహమే, అధికారిగా చేసేందుకు, ఆత్మిక నషాను అనుభవం చేయించేందుకు ఆధారము. స్నేహముంటే రమణీకమైన బ్రాహ్మణ జీవితముంటుంది. స్నేహం లేకపోతే బ్రాహ్మణ జీవితం ఎండిపోయినట్లుగా (నిస్సారంగా), శ్రమతో కూడినదిగా ఉంటుంది. పరమాత్మ స్నేహం హృదయపూర్వకమైన స్నేహము. లౌకిక స్నేహం హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది ఎందుకంటే అది విభజించబడుతుంది, అనేకమందితో స్నేహం నిర్వర్తించాల్సి వస్తుంది. అలౌకిక స్నేహం హృదయం యొక్క అనేక ముక్కలను కలుపుతుంది. ఒక్క తండ్రితో స్నేహం చేస్తే సర్వుల సహయోగిగా స్వతహాగా అవుతారు ఎందుకంటే తండ్రి బీజము. బీజానికి నీరు అందించడంతో ప్రతి ఆకుకు స్వతహాగా నీరు లభిస్తుంది, ఇక ఆకు-ఆకుకు నీరు ఇవ్వాల్సిన అవసరముండదు. అలానే, ఆత్మిక తండ్రితో స్నేహాన్ని జోడించడం అనగా సర్వులకు స్నేహీగా అవ్వడం, అందుకే హృదయం ముక్కలు ముక్కలుగా అవ్వదు. స్నేహం ప్రతి కార్యాన్ని సహజం చేస్తుంది అనగా శ్రమ నుండి విడిపిస్తుంది. ఎక్కడైతే స్నేహముంటుందో, అక్కడ స్మృతి అనేది తప్పకుండా స్వతహాగా, సహజంగా వస్తుంది. స్నేహీలను మర్చిపోవడం కష్టమవుతుంది, స్మృతి చేయడం కష్టమవ్వదు. బుద్ధిలో జ్ఞానం అనగా తెలివి ఎంత ఉన్నా కానీ యథార్థ జ్ఞానం అనగా స్నేహ సంపన్న జ్ఞానముండాలి. ఒకవేళ జ్ఞానం ఉంది కానీ స్నేహం లేదంటే అది సారం లేని జ్ఞానము. స్నేహం సర్వ సంబంధాలను హృదయపూర్వకంగా అనుభవం చేయిస్తుంది. కేవలం జ్ఞానీ అన్నవారు బుద్ధితో స్మృతి చేస్తారు, స్నేహీలు హృదయంతో స్మృతి చేస్తారు. బుద్ధితో స్మృతి చేసేవారికి స్మృతిలో, సేవలో, ధారణలో శ్రమ చేయాల్సి వస్తుంది. వీరు శ్రమ యొక్క ఫలాన్ని తింటారు, వారు ప్రేమ ఫలాన్ని తింటారు. ఎక్కడైతే స్నేహం ఉండదో, కేవలం బుద్ధి యొక్క జ్ఞానం మాత్రమే ఉంటుందో, అక్కడ జ్ఞాన విషయాలలో కూడా ఎందుకు, ఏమిటి, ఎలా… అని బుద్ధి యుద్ధం చేస్తూ ఉంటుంది, తమతో తమకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడుస్తాయి. ఎక్కడైతే ఎందుకు-ఎందుకు అనేది ఉంటుందో, అక్కడ ఎందుకు అనే క్యూ ఉంటుంది. ఎక్కడైతే స్నేహముంటుందో, అక్కడ యుద్ధం ఉండదు, ప్రేమలో నిమగ్నమై ఉంటారు, లీనమై ఉంటారు. ఎవరి పట్లనైతే హృదయపూర్వక స్నేహముంటుందో, అక్కడ స్నేహం కారణంగా ఏ విషయాలలోనూ ఎందుకు, ఏమిటి… అనేవి తలెత్తవు. ఎలాగైతే దీపపు పురుగు దీపం పట్ల స్నేహంతో ఎందుకు, ఏమిటి అని అనకుండా బలిహారమవుతుందో, అలా పరమాత్మ స్నేహీ ఆత్మలు స్నేహంలో లీనమై ఉంటారు.

చాలామంది పిల్లలు బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఫిర్యాదు చేస్తారు, అదేమిటంటే – ‘‘జ్ఞానమైతే బుద్ధిలో ఉంది, బ్రాహ్మణులుగా కూడా అయ్యాము, ఆత్మను కూడా తెలుసుకున్నాము, తండ్రి పరిచయాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్నాము, సంబంధాల గురించి కూడా తెలుసు, చక్రం యొక్క జ్ఞానం కూడా ఉంది, రచయిత మరియు రచనల జ్ఞానం కూడా పూర్తిగా ఉంది – అయినా స్మృతి సులభంగా ఎందుకు ఉండదు? ఆనందం, శక్తి మరియు శాంతి యొక్క అనుభూతి సదా ఎందుకు జరగదు? స్మృతి అనేది శ్రమతో ఎందుకు కలుగుతుంది, నిరంతర స్మృతి ఎందుకు ఉండదు? స్మృతిని పదే-పదే ఎందుకు మర్చిపోతాము?’’ దీనికి కారణమేమిటంటే, జ్ఞానం బుద్ధి వరకే ఉంది, జ్ఞానంతో పాటు హృదయపూర్వకమైన స్నేహం తక్కువగా ఉంది. బుద్ధి యొక్క స్నేహముంది. నేను సంతానాన్ని, వారు తండ్రి, దాత, విధాత – ఈ విధంగా బుద్ధి యొక్క జ్ఞానముంది. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం హృదయంలో ఇమిడిపోతుందో, అప్పుడు స్నేహానికి గుర్తుగా ఏమి చూపిస్తారు? హృదయము. అప్పుడు, జ్ఞానం మరియు స్నేహం కంబైండ్ గా అవుతాయి. జ్ఞానం బీజము కానీ స్నేహం నీరు. ఒకవేళ బీజానికి నీరు లభించకపోతే ఫలాలను ఇవ్వదు. అలాగే జ్ఞానం ఉంది కానీ హృదయపూర్వకమైన స్నేహం లేకపోతే ప్రాప్తి అనే ఫలం లభించదు, అందుకే శ్రమ అనిపిస్తుంది. స్నేహం అనగా సర్వ ప్రాప్తుల, సర్వ అనుభవాల సాగరంలో ఇమిడి ఉండడము. లౌకిక ప్రపంచంలో కూడా చూడండి, స్నేహంతో ఇచ్చిన చిన్న కానుక కూడా ఎంత ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది! మరియు స్వార్థపూరితమైన సంబంధంతో ఇచ్చిపుచ్చుకుంటే, కోట్లు ఇచ్చినా సరే, ఆ కోట్లతో సంతుష్టత ఉండదు. ఇది ఉండాలి, ఇలా చేయాలి… అని ఏదో ఒక లోపాన్ని వెలికి తీస్తుంటారు. ఈ రోజుల్లో ఎంత ఖర్చు చేస్తారు, ఎంత షో చేస్తారు. కానీ ఆ స్నేహం సమీపంగా తీసుకొస్తుందా లేక దూరం చేస్తుందా? కోట్లు ఇచ్చిపుచ్చుకున్నా సరే అంతటి సుఖం అనుభవమవ్వదు కానీ హృదయపూర్వకమైన స్నేహంతో ఇచ్చిన ఒక చిన్న వస్తువు కూడా ఎంత సుఖాన్ని అనుభవం చేయిస్తుంది! ఎందుకంటే హృదయపూర్వకమైన స్నేహం లెక్కాచారాలను కూడా సమాప్తం చేస్తుంది. స్నేహమనేది అటువంటి విశేషమైన అనుభూతి. కనుక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి – జ్ఞానంతో పాటు హృదయపూర్వకమైన స్నేహముందా? హృదయంలో లీకేజ్ అయితే లేదు కదా? లీకేజ్ ఉంటే ఏమవుతుంది? ఒకవేళ ఒక్క తండ్రి పట్ల తప్ప ఇంకెవరు పట్లనైనా సంకల్పమాత్రంగానైనా స్నేహముంటే, వ్యక్తుల పట్లనైనా, వైభవాల పట్లనైనా, వ్యక్తుల శరీరాల పట్ల స్నేహమున్నా, వారి విశేషతల పట్ల స్నేహమున్నా, హద్దు ప్రాప్తుల ఆధారంగా స్నేహమున్నా, ఆ విశేషతలను ఇచ్చేవారు ఎవరు, ప్రాప్తి చేయించేవారు ఎవరు?

ఏ రకమైన స్నేహం అనగా మోహం సంకల్పమాత్రంగా ఉన్నా, వాణి మాత్రంగా ఉన్నా లేక కర్మలో ఉన్నా, దీనిని లీకేజ్ అని అంటారు. చాలామంది పిల్లలు చాలా అమాయకంగా – మోహం లేదు కాని బాగా అనిపిస్తుంది, కావాలనుకోవడం లేదు కానీ గుర్తుకొస్తుంది అని అంటారు. కనుక మోహానికి గుర్తు – సంకల్పం, మాట మరియు కర్మ ద్వారా లొంగుబాటు. లీకేజ్ ఉన్న కారణంగా శక్తి పెరగదు మరియు శక్తిశాలిగా లేని కారణంగా తండ్రిని స్మృతి చేయడం శ్రమ అనిపిస్తుంది మరియు శ్రమ ఉన్న కారణంగా సంతుష్టత ఉండదు. ఎక్కడైతే సంతుష్టత ఉండదో, అక్కడ ఇప్పుడిప్పుడే స్మృతి యొక్క అనుభూతితో ఆనందంలో నిమగ్నమై ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే మళ్ళీ నిరాశ పడతారు, ఎందుకంటే లీకేజ్ ఉన్న కారణంగా శక్తి అనేది కొద్ది సమయానికి నిండుతుంది కానీ సదా ఉండదు, అందుకే సహజ నిరంతర యోగులుగా అవ్వలేరు. కావున ఏ వ్యక్తి లేక వైభవం పట్ల మోహం లేదు కదా అనగా లీకేజ్ లేదు కదా అని చెక్ చేసుకోండి. ఈ లీకేజ్ ప్రేమలో లీనమైన స్థితిని అనుభవం చేయనివ్వదు. వైభవాలను ఉపయోగిస్తే ఉపయోగించండి కానీ యోగులుగా అయి ఉపయోగించండి. వేటినైతే మీరు విశ్రాంతికి సాధనాలని భావిస్తున్నారో, అవి మీ మానసిక స్థితిని విశ్రాంతి లేకుండా చేయకూడదు ఎందుకంటే చాలామంది పిల్లలు వైభవాలకు వశమై ఉన్నా కానీ మనసు యొక్క మోహాన్ని తెలుసుకోలేరు. మనమేమీ హఠయోగులము కాదు, సహజయోగులము అనే రాయల్ భాషను మాట్లాడుతారు. సహజయోగులుగా అవ్వడం మంచిదే కానీ యోగులుగా ఉన్నారా? ఏదైతే తండ్రి స్మృతిని అలజడిలోకి తీసుకొస్తుందో అనగా తనవైపు ఆకర్షించి, లొంగేలా చేస్తుందో, అది యోగులుగా అయి ఉపయోగించేవారిగా అవ్వనివ్వదు ఎందుకంటే బాబాకు చెందినవారిగా అయినందుకు సమయానుసారంగా ప్రకృతి దాసిగా అవుతుంది అనగా వైభవాలతో కూడిన సాధనాల ప్రాప్తి పెరుగుతూ ఉంది. ఇప్పుడిప్పుడే ఈ 18-19 సంవత్సరాలలో ఎంత ప్రాప్తి లభిస్తుంది! విశ్రాంతి సాధనాలన్నీ పెరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రాప్తులు బాబాకు చెందినవారిగా అయినందుకు ప్రతిఫలంగా లభిస్తున్నాయి. కావున ఫలాన్ని తింటూ బీజాన్ని మర్చిపోకండి. ఈ సాధనాలు కొంత సమయం పెరుగుతూ ఉంటాయి. కానీ ఆరామ్ (విశ్రాంతి) లోకి వస్తూ రాముడిని మర్చిపోకండి. సత్యమైన సీతగా ఉండండి. మర్యాదల రేఖ నుండి సంకల్పమనే బొటనవేలును కూడా బయటకు రానివ్వద్దు ఎందుకంటే సాధన లేకుండా సాధనాలను ఉపయోగిస్తే అవి బంగారు జింక వలె పని చేస్తాయి. కనుక వ్యక్తులు మరియు వైభవాల మోహం మరియు లొంగుబాటు నుండి స్వయాన్ని సదా సురక్షితంగా ఉంచుకోండి లేదంటే తండ్రికి స్నేహీలుగా, సహజయోగులుగా అయ్యేందుకు బదులుగా అప్పుడప్పుడు సహయోగులుగా, అప్పుడప్పుడు సహజయోగులుగా, అప్పుడప్పుడు వియోగులుగా – ఈ రెండింటినీ అనుభవం చేస్తూ ఉంటారు. ఒక్కో సారి యాద్ (స్మృతి), ఒక్కో సారి (ఫరియాద్) ఫిర్యాదులు – ఇలాంటి అనుభవాలలో ఉంటారు, అంతేకాక ఫిర్యాదులు కూడా ఎప్పుడూ పూర్తవ్వవు.

వ్యక్తి మరియు వైభవాలకు లొంగి ఉండేవారి గుర్తులు – ఒకటి వినిపించాము – వారు ఒక్కో సారి సహజయోగులుగా, ఒక్కో సారి యోగులుగా, ఒక్కో సారి ఫిర్యాదులు చేసేవారిగా ఉంటారు. రెండవ విషయమేమిటంటే – ఇలాంటి ఆత్మలకు సాధనాలు, సహయోగం, స్నేహం మొదలైన ప్రాప్తులన్నీ ఉంటాయి కానీ లీకేజ్ కలిగిన ఆత్మ ప్రాప్తులు ఉన్నప్పటికి ఎప్పుడూ సంతుష్టంగా ఉండరు. వారి నోటి ద్వారా సదా ఏదో ఒక రకమైన అసంతుష్టతతో కూడిన మాటలు వద్దనుకున్నా వెలువడుతూ ఉంటాయి. ఇతరులకు వారిని చూస్తే, వీరికి చాలా లభిస్తుంది, వీరిలాగా మరెవ్వరికీ లభించదు అన్నట్లు అనుభవమవుతుంది. కానీ ఆ ఆత్మ సదా తన అప్రాప్తిని, దుఃఖాన్ని వర్ణిస్తూ ఉంటుంది. వీరంత సంతోషంగా ఇంకెవ్వరూ ఉండరని ఇతరులు అంటారు, అయితే వారు నా అంతటి దుఃఖితులు ఎవ్వరూ ఉండరని అంటారు, ఎందుకంటే వారు గ్యాస్ బెలూన్ వంటివారు. గ్యాస్ నిండినప్పుడు చాలా పైకి వెళ్తుంది, గ్యాస్ సమాప్తమైపోతే ఎక్కడో పడిపోతుంది. ఎగురుతూ ఉంటే చూసేందుకు చాలా సుందరంగా అనిపిస్తుంది కాని అది అల్పకాలానికే ఉంటుంది. వారు ఎప్పుడూ తమ భాగ్యంతో సంతుష్టంగా ఉండరు. సదా ఎవరో ఒకరిని తమ భాగ్యానికి, అప్రాప్తికి నిమిత్తంగా చేస్తూ – వీరిలా చేస్తారు, వీరిలా ఉంటారు, అందుకే నాకు భాగ్యం లేదు అని అంటారు. భాగ్యాన్ని తయారుచేసేవారు భాగ్యవిధాత. భాగ్యవిధాత భాగ్యాన్ని తయారుచేస్తున్నప్పుడు, ఆ పరమాత్మ-శక్తి ముందు ఆత్మల శక్తి భాగ్యాన్ని కదిలించలేదు. ఇవన్నీ సాకులు. ఎగిరే కళలోకి వెళ్ళడం రాకపోతే చాలా సాకులు చెప్తారు. ఇందులో అందరూ తెలివైనవారిగా ఉన్నారు. కావున స్నేహంతో లొంగుబాటు ఉన్నా, లెక్కాచారాలు సమాప్తం చేసుకుంటున్న కారణంగా లొంగుబాటు ఉన్నా చెక్ చేసుకోండి.

ఎవరి పట్లనైనా ఈర్ష్య లేక ద్వేషమున్నా, అక్కడ కూడా లొంగుబాటు ఉంటుంది. పదే-పదే వారే గుర్తుకొస్తూ ఉంటారు. బాబాను స్మృతి చేయాలని యోగంలో కూర్చొంటారు కానీ ఎవరి పట్లనైతే ఈర్ష్య లేక ద్వేషముందో, ఆ ఆత్మ గుర్తుకొస్తుంది. నేను స్వదర్శన చక్రధారిని అని అనుకుంటారు కానీ పరదర్శన చక్రం తిరుగుతుంది. ఈ రెండు రకాల లొంగుబాటు కిందికి తీసుకొస్తుంది కనుక ఈ రెండింటినీ చెక్ చేసుకోండి. తర్వాత బాబా ముందు అర్జీ వేస్తారు – అసలైతే నేను చాలా మంచివాడిని, కేవలం ఈ ఒక్క విషయమే ఇలా ఉంది, దీనిని మీరు తొలగించండి. లెక్కాచారం తయారుచేసుకుంది మీరు మరియు దానిని తీర్చాల్సింది తండ్రినా అని బాబా చిరునవ్వు నవ్వుతారు. లెక్కాచారం తీర్చుకునేలా చేయండి అనడం బాగానే ఉంది కానీ లెక్కాచారాన్ని తీర్చండి అనడం సరికాదు. లెక్కాచారం తయారుచేసుకునే సమయంలో బాబాను మర్చిపోయారు కానీ తీర్చుకునే సమయంలో బాబా, బాబా అని అంటారు! చేసేవారు-చేయించేవారు చేయించేందుకు బంధించబడి ఉన్నారు కాని చేయాల్సింది మీరే కదా. మరి పిల్లల గురించిన ఏయే సమాచారం బాప్ దాదా చూస్తారో, విన్నారా? సారమేమిటి? కేవలం ఎండిపోయిన (నిస్సారమైన) జ్ఞానీలుగా అవ్వకండి, బుద్ధి యొక్క జ్ఞానీలుగా అవ్వకండి, హృదయపూర్వకమైన జ్ఞానీలుగా మరియు స్నేహీలుగా అవ్వండి మరియు లీకేజ్ ను చెక్ చేసుకోండి. అర్థమయిందా?

జనవరి 18 వస్తోంది కదా, అందుకే జనవరి 18ని సదాకాలానికి సమర్థ దివసంగా జరుపుకోవాలని ముందే గుర్తు చేస్తున్నాము. అర్థమయిందా? కేవలం బ్రహ్మాబాబా జీవితచరిత్రను వినిపిస్తూ జరుపుకోవడం కాదు కానీ వారి సమానమైన జీవితాన్ని తయారుచేసుకునే విధంగా జరుపుకోవాలి. అచ్ఛా.

సదా వ్యక్తులు మరియు వైభవాల లొంగుబాటు నుండి అతీతంగా బాబా స్నేహంలో ఇమిడి ఉండేవారు, సదా యథార్థమైన జ్ఞానం మరియు హృదయపూర్వకమైన స్నేహం – ఈ రెండింటిలోనూ కంబైండ్ స్థితిని అనుభవం చేసేవారు, సదా యోగులుగా అయి సాధన స్థితి ద్వారా సాధనాలను కార్యంలో ఉపయోగించేవారు, సదా స్నేహీలు, హృదయంలో ఇమిడి ఉన్న పిల్లలకు హృదయాభిరాముడైన తండ్రి యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక – స్వయాన్ని డబల్ హీరోలుగా భావిస్తున్నారా? వజ్ర తుల్య జీవితం తయారైంది కనుక వజ్ర సమానంగా అయ్యారు, అంతేకాక సృష్టి డ్రామాలో ఆది నుండి అంతం వరకు హీరో పాత్రను అభినయిస్తారు. కనుక డబల్ హీరోలుగా అయ్యారు కదా. హద్దు డ్రామాలో పాత్రను అభినయించే వారెవరైనా కేవలం హీరో పాత్రధారులుగా గాయనం చేయబడతారు కానీ డబల్ హీరోలు ఎవ్వరూ ఉండరు. కానీ మీరు డబల్ హీరోలు. బాబాతో పాటు పాత్రను అభినయించడం – ఇది ఎంత గొప్ప భాగ్యం! కనుక సదా ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా. ఆగిపోయేవారైతే కాదు కదా? ఎవరైతే అలసిపోరో, వారు ఆగిపోరు, ముందుకు వెళ్తూనే ఉంటారు. మీరు ఆగిపోయేవారా లేక అలసిపోయేవారా? ఒంటరిగా ఉంటే అలసిపోతారు. బోర్ ఫీల్ అయితే అలసిపోతారు. కానీ ఎక్కడైతే తోడు ఉంటుందో, అక్కడ సదా ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి. ఏదైనా యాత్రకు వెళ్ళేటప్పుడు ఏమి చేస్తారు? గ్రూప్ తయారుచేస్తారు కదా. ఎందుకు తయారుచేస్తారు? గ్రూప్ ఉంటే, తోడు ఉంటే ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలా మీరందరూ కూడా ఆత్మిక యాత్రలో సదా ముందుకు వెళ్తూ ఉండండి ఎందుకంటే బాబా తోడు, బ్రాహ్మణ పరివారం యొక్క తోడు ఎంత గొప్పవి! ఒకవేళ ఎవరైనా మంచి సాథీ (సహచరులు) ఉంటే ఎప్పుడూ బోర్ అవ్వరు, అలసిపోరు. సదా ముందుకు వెళ్ళేవారు సదా హర్షితంగా ఉంటారు, సదా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు, కనుక వృద్ధిని చెందుతూ ఉంటారు కదా! వృద్ధి ప్రాప్తి అవ్వాల్సిందే ఎందుకంటే ఎక్కడ, ఏ మూలలో విడిపోయిన పిల్లలు ఉన్నా సరే, ఆ ఆత్మలు అక్కడ సమీపంగా రావాల్సిందే కనుక సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. శాంతిగా కూర్చోవాలని ఎంత అనుకున్నా సరే కూర్చోలేరు. సేవ కూర్చోనివ్వదు, ముందుకు తీసుకువెళ్తుంది ఎందుకంటే ఏ ఆత్మలైతే తండ్రికి చెందినవారిగా ఉండేవారో, వారు మళ్ళీ తండ్రికి చెందినవారిగా అవ్వాల్సిందే. అచ్ఛా.

ముఖ్యమైన సోదరులతో అవ్యక్త బాప్ దాదా కలయిక – శక్తులకైతే మంచి ఛాన్స్ లభిస్తుంది కనుక దాదీలుగా అవ్వడం మంచిదని పాండవులు ఆలోచిస్తారు. కానీ ఒకవేళ ప్లానింగ్ బుద్ధి గల పాండవులు లేకుంటే శక్తులు ఏమి చేస్తారు? అంతిమ జన్మలో కూడా పాండవులుగా అవ్వడమనేది తక్కువ భాగ్యమేమీ కాదు. ఎందుకంటే బ్రహ్మాబాబాతోపోటు ఉండడమే పాండవుల విశేషత. కనుక పాండవులు తక్కువేమీ కాదు. పాండవులు లేకుండా శక్తులు లేరు, శక్తులు లేకుండా పాండవులు లేరు. చతుర్భుజాలలో రెండు భుజాలు వీరు, రెండు భుజాలు వారు కనుక పాండవుల విశేషత వారిదే. నిమిత్త సేవ వీరికి (దాదీలకు) లభించింది కనుక వీరు చేస్తున్నారు. ఇకపోతే పాండవుల పట్ల శక్తులకు, శక్తుల పట్ల పాండవులకు స్నేహముంది, గౌరవముంది మరియు అది సదా ఉంటుంది. శక్తులు పాండవులను ముందుంచుతారు – ఇందులోనే సఫలత ఉంది మరియు పాండవులు శక్తులను ముందుంచుతారు – ఇందులోనే సఫలత ఉంది. ‘ముందు మీరు’ అనే పాఠం ఇరువురికీ పక్కాగా ఉంది. ‘ముందు మీరు, ముందు మీరు’ అని అంటూ స్వయం కూడా ‘ముందు మీరు’ గా అవుతారు. తండ్రి మధ్యలో ఉన్నారు కనుక ఏ గొడవ ఉండదు. పాండవులకు బుద్ధి యొక్క వరదానం మంచిగా లభించి ఉంది. ఏ కార్యానికి నిమిత్తంగా అయ్యారో, వారికి అదే విశేషత లభించి ఉంది. అంతేకాక ప్రతి ఒక్కరి విశేషత ఒకరి కంటే ఒకరిది ముందు ఉంది, అందుకే మీరు నిమిత్తంగా ఉన్న ఆత్మలు. అచ్ఛా.

వరదానము:-

మీ సంకల్పాలను, వృత్తిని మరియు స్మృతిని చెక్ చేసుకోండి – ఏదో తప్పు జరిగిపోయింది, పశ్చాత్తాపపడ్డాము, క్షమాపణ అడిగాము, అంతే అయిపోయింది అని కాదు. ఎవరెంత క్షమాపణ తీసుకున్నా కానీ ఏదైతే పాప కర్మ లేక వ్యర్థ కర్మ జరిగిందో, దాని మరక చెరిగిపోదు. రిజిస్టరు శుద్ధంగా, స్వచ్ఛంగా ఉండదు. కేవలం ఈ పద్ధతిని అనుసరించడం కాదు, కానీ నేను సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణాత్మను, అపవిత్రత అనేది సంకల్పాన్ని, వృత్తిని మరియు స్మృతిని కూడా టచ్ చేయకూడదు అనే స్మృతి ఉండాలి. దీని కోసం అడుగడుగులోనూ సావధానంగా ఉండండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

0 Comment

No Comment.

Scroll to Top