24 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

November 23, 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు ఇక్కడకు మీ రాజ్య భాగ్యాన్ని తయారుచేసుకోవడానికి వచ్చారు, ఎంతగా స్మృతిలో ఉంటారో, చదువు పట్ల అటెన్షన్ పెడతారో, అంతగా శ్రేష్ఠ భాగ్యం తయారవుతూ ఉంటుంది”

ప్రశ్న: -

సంగమంలో ఏ శ్రీమతాన్ని పాలన చేసి 21 జన్మలకు మీ భాగ్యాన్ని శ్రేష్ఠంగా తయారుచేసుకుంటారు?

జవాబు:-

సంగమంలో తండ్రి శ్రీమతము – మధురమైన పిల్లలూ, నిర్వికారీగా అవ్వండి. దేహీ-అభిమానులుగా అవ్వడానికి పూర్తి పురుషార్థం చేయండి. ఎప్పుడూ ఏ పాప కర్మ చేయకండి, అప్పుడు 21 జన్మల కోసం భాగ్యం శ్రేష్ఠంగా తయారవుతుంది.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను….

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఇప్పుడు ఈ రెండు లైనుల అర్థాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, వారు చేతులెత్తండి? భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని ఎవరన్నారు? ఆత్మ. అందరి ఆత్మలు అంటాయి – నేను భాగ్యాన్ని తయారుచేసుకొని వచ్చాను. ఏ భాగ్యము? కొత్త ప్రపంచంలోకి వెళ్ళే భాగ్యము. కొత్త ప్రపంచము స్వర్గము, ఈ పాత ప్రపంచము నరకము. ఈ విషయాన్ని ఆత్మలందరూ అంటారు. ఆత్మకైతే శరీరం తప్పకుండా కావాలి, అప్పుడే మాట్లాడగలదు. మేము స్కూల్లో భాగ్యాన్ని తయారుచేసుకోవడానికి వచ్చామని జీవాత్మలు అంటారు. చదివించేవారు ఎవరు? జ్ఞానసాగరుడైన శివబాబా. మనుష్యులను దేవతలుగా లేదా పతితులను పావనులుగా, నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేసేవారు ఆ ఒక్క తండ్రి మాత్రమే. ఈ నరకానికి నిప్పు అంటుకోనున్నది. మేము అనంతమైన తండ్రి వద్దకు వచ్చామని పిల్లలు చెప్పేటువంటి స్కూలు ప్రపంచంలో ఏదీ లేదు. అలానే, నేను తండ్రిని కూడా, టీచరును కూడా, గురువును కూడా అని చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. ఈ బ్రహ్మా కూడా చెప్పలేరు. నేను అందరికీ తండ్రిని, టీచరును, గురువును అని ఒక్క శివబాబా మాత్రమే అంటారు. వారే కూర్చొని చదివిస్తారు. కనుక ఇప్పుడు పిల్లలు భాగ్యాన్ని తయారుచేసుకోవాలి. కొత్త ప్రపంచ రాజధాని యొక్క భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు మేము వచ్చామని పిల్లలంటారు. ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నదని మనకు తెలుసు. తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. మీరు 21 జన్మల రాజ్య-భాగ్యాన్ని తీసుకోవడానికి చదువుకుంటారు. అనగా మీరు రాజ్య భాగ్యాన్ని తయారుచేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ పాట ఆ నాటకం వారి ద్వారా తయారుచేయబడినది, కానీ దీని అర్థం మళ్ళీ తెలియజేయబడుతుంది. ఎలాగైతే, తండ్రి కూర్చుని అన్ని వేదాలు, శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో భక్తి ఉంది. సత్యయుగంలో భక్తి, మందిరాలు మొదలైనవి ఉండవు. మీరు అర్ధకల్పం భక్తి చేసారు, ఇప్పుడు భగవంతుడు లభించారు. మొట్టమొదట భారత్ లో ఈ దేవీ-దేవతల రాజ్యముండేది. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ భాగ్యం పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. తండ్రి భాగ్యాన్ని తయారుచేయడానికే వచ్చారు. నన్ను స్మృతి చేయండి అని పిల్లలకు చెప్తారు. మీరు చాలా పాపాత్ములుగా అయిపోయారు. మొట్టమొదట భక్తి శివబాబాకు చేయడం జరుగుతుంది, అది అవ్యభిచారి భక్తి. తర్వాత భక్తి కూడా వ్యభిచారిగా అయిపోతుంది. కనుక పిల్లలకు మొట్టమొదట ఈ నిశ్చయముండాలి – ఎవరినైతే భగవంతుడని అంటారో, వారు మనల్ని చదివిస్తున్నారు. వారికి శరీరమేమీ లేదు, వారు ఈ శరీరంలో కూర్చుని మాట్లాడుతారు. ఎలాగైతే మీ ఆత్మ ఈ శరీరంలోకి రావడంతో మాట్లాడడం మొదలుపెడుతుంది. అప్పుడప్పుడు మనుష్యులు మరణిస్తారు కానీ శ్మశానానికి తీసుకువెళ్ళేటప్పుడు సగం దారిలో కదలడం మొదలుపెడతారు. అలాగని, ఆత్మ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిందని కాదు. ఆత్మ చాలా సూక్ష్మమైనది కదా, కావున ఎక్కడో దాగి ఉంది. స్పృహ తప్పిపోయింది, ఎవరికీ తెలియలేదు అని అంటారు. అలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. చితిపై నుండి కూడా లేస్తారు, అప్పుడు వారిని చితిపై నుండి దించేస్తారు. మరి ఇదేమిటి? ఆత్మ ఎక్కడో దాగి ఉంది. మళ్ళీ తన స్థానానికి వచ్చేసింది. ఆత్మ లేకపోతే శరీరం పూర్తిగా శవమైపోతుంది. ఆత్మల దేశము పరంధామము. మనం అక్కడ ఆ ఇంట్లో ఉండేటువంటి వారము అని మీకు తెలుసు. మొట్టమొదట ఆత్మలైన మనం ఇంటి నుండి సత్యయుగంలోకి వచ్చాము. భారతవాసులు, ఎవరైతే దేవీ-దేవతలుగా ఉండేవారో, వారే వచ్చి ఉంటారు. వాస్తవానికి ఎయే ధర్మాలనైతే స్థాపన చేస్తారో, అవి చివరి వరకు నిలిచి ఉంటాయి. బుద్ధుని యొక్క ధర్మమూ ఉంది, క్రైస్టు యొక్క ధర్మమూ ఉంది. కేవలం దేవీ-దేవతా ధర్మం వారు, ఎవరైతే రాజ్యం చేసేవారో, వారి పేరే మాయమైపోయింది. స్వయాన్ని దేవీ-దేవతా ధర్మం వారిగా చెప్పుకునేవారు ఎవ్వరూ లేరు.

తండ్రి అర్థం చేయిస్తారు – భారతవాసులు తమ ధర్మాన్ని మర్చిపోయారు, మన గృహస్థ ధర్మం పవిత్రంగా ఉండేది. సంపూర్ణ నిర్వికారీ, మహారాజా-మహారాణుల రాజ్యముండేది. వారిని భగవతి లక్ష్మీ మరియు భగవాన్ నారాయణ అని అంటారు. వాస్తవానికి భగవంతుడు ఒక్కరే, వారినే జ్ఞాన సాగరుడని అంటారు. ఈ లక్ష్మీ-నారాయణులలో ఏ జ్ఞానము లేదు. జ్ఞాన సాగరుడు ఒక్క శివబాబా మాత్రమే. వారు కూర్చుని పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తారు. మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఈ చదువును మళ్ళీ అక్కడ మర్చిపోతారు. మా ఆత్మలో 84 జన్మల రికార్డు నిండి ఉందని ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు. ఆత్మ ఇప్పుడు జ్ఞానం తీసుకుంటుంది. తర్వాత సత్యయుగంలోకి వెళ్ళి తన రాజ్యం చేస్తుంది. మీరంటారు – మేము 84 జన్మల చక్రంలో తిరిగాము, ఇప్పుడు బాబా నుండి మేము స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఆ తాతగారి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు, కానీ తమ-తమ పురుషార్థానుసారంగా తీసుకుంటారు. ఇందులో వాటాలు ఏమీ పంచబడవు. అజ్ఞాన కాలంలో పంచబడతాయి కదా. అనంతమైన తండ్రి అంటారు – నేను వైకుంఠాన్ని స్థాపన చేస్తాను, అందులో ఉన్నత పదవిని పొందడమనేది మీ పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి, పవిత్రంగా అవుతారు. బంగారాన్ని భట్టీలో వేస్తారు కదా. అప్పుడు దాని నుండి మాలిన్యం తొలగి సత్యమైన బంగారు ముద్దగా అవుతుంది. ఈ ఆత్మ కూడా సత్యమైన బంగారంగా ఉండేది, ఇక్కడకు పాత్రను అభినయించడానికి వస్తుంది. మొదట బంగారు యుగానికి చెందినదిగా ఉంటుంది, ఆ తర్వాత వెండి యొక్క మాలిన్యం ముందుగా చేరింది. ఆత్మ కొద్దిగా అపవిత్రంగా అవుతుంది. తర్వాత నెమ్మది-నెమ్మదిగా కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఇల్లు కూడా ముందు కొత్తదిగా, తర్వాత నెమ్మది-నెమ్మదిగా పాతదిగా అవుతూ ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత పాతది అని అంటారు. అలాగే ప్రపంచం కూడా కొత్తదిగా మరియు పాతదిగా అవుతుంది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం కొత్తదిగా ఉండేది, ఈ దేవీ-దేవతల రాజ్యమేదైతే ఉండేదో, అది ఎమయ్యింది? 84 జన్మలను అనుభవిస్తూ-అనుభవిస్తూ పాతబడిపోయింది. ఆత్మ కూడా మలినంగా అయిపోయింది, శరీరం కూడా మలినంగా అయిపోయింది. తెల్లగా ఉన్నవారి నుండి నల్లగా ఉన్నవారిగా అయ్యారు. కృష్ణుడిని కూడా తెల్లగా మరియు నల్లగా చూపిస్తారు కదా, కాళ్ళను నరకం వైపు, ముఖాన్ని స్వర్గం వైపు చూపించాలి. మీరు కూడా ఆ కులానికి చెందినవారే. మీవి కూడా కాళ్ళు నరకం వైపు, ముఖం స్వర్గం వైపు ఉన్నాయి. ఇప్పుడు మీరు ముందు నిర్వాణధామంలోకి వెళ్ళి తర్వాత స్వర్గంలోకి వస్తారు. కలియుగానికి నిప్పు అంటుకుంటుంది. కుండపోత వర్షాలు కురుస్తాయి, మంటలు అంటుకుంటాయి, భూకంపాలు వస్తాయి. పతిత ఆత్మలందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రమే మిగులుతారు. పవిత్రాత్మలు వస్తూ ఉంటారు. ఇప్పుడైతే అందరూ ముళ్ళలా ఉన్నారు. కామ ఖడ్గాన్ని నడిపించడము, ఇది ముళ్ళు గుచ్చడం వంటిది. ఇక్కడ తండ్రి అంటారు, సంపూర్ణ నిర్వికారీగా అవ్వాలి అని. తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే నేను మీకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తాను, మీరు పవిత్రంగా అవుతారు. మీరు పావనంగా ఉన్నప్పుడు గృహస్థ వ్యవహారం కూడా పవిత్రంగా ఉండేది. ఇప్పుడు మీరు పతితంగా అయ్యారు కనుక గృహస్థ వ్యవహారం కూడా అపవిత్రంగా, వికారీగా ఉంది. సత్యయుగంలో వ్యాపార వ్యవహారాలు కూడా సత్యంగా జరుగుతాయి. అక్కడ అసత్యం మొదలైనవి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎక్కువ ధనాన్ని సంపాదించాలనే లోభమున్నప్పుడు అసత్యం చెప్పడం జరుగుతుంది. అక్కడైతే అపారమైన ధనం లభిస్తుంది. ధాన్యం మొదలైనవాటికి ధర ఏమీ ఉండదు. అక్కడ పేదవారు ఎవ్వరూ ఉండనే ఉండరు, ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో, వారు మహారాజుగా అవుతారు. వజ్ర-వైఢూర్యాల మహళ్ళు లభిస్తాయి. పురుషార్థం పూర్తిగా చేయకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. రాజా-రాణి, తర్వాత రాకుమారుడు-రాకుమారి, మొత్తం వంశమంతా ఉంటుంది కదా. తర్వాత ప్రజల్లో కూడా నంబరువారుగా షావుకార్లు మరియు పేద ప్రజలు ఉంటారు. అక్కడైతే అందరూ పవిత్రంగా ఉంటారు. రాజు, రాణి ఉంటారు, మంత్రి కూడా ఒకరు ఉంటారు. అక్కడ చాలా మంది మంత్రులేమీ ఉండరు. రాజులో రాజ్యాన్ని నడిపించే శక్తి ఉంటుంది. తండ్రి ఏ విధంగా అర్థం చేయిస్తారో, అలా పిల్లలు కూడా అర్థం చేయించాలి. భారతవాసులైన మనం దేవీ-దేవతలుగా ఉండేవారము. సత్యయుగంలో మన రాజ్యముండేది. గృహస్థ వ్యవహారంలో మనం పవిత్రంగా ఉండేవారము, స్వర్గవాసులుగా ఉండేవారము. తర్వాత పతితంగా అవుతూ-అవుతూ నరకవాసులుగా అయ్యాము, మళ్ళీ స్వర్గవాసులుగా అవుతాము. ఇది తయారుచేయబడిన ఆట. ఒక్క జన్మలో స్వర్గవాసులుగా తయారవుతారు, మళ్ళీ నరకవాసులుగా అవ్వడంలో 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా చూపించబడింది. మనం వెళ్ళి స్వర్గంలో రాజ్యం చేస్తామని ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రియే సత్యాన్ని తెలియజేసి నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. అక్కడ వారు సత్యనారాయణ కథను ఏదైతే వింటారో, దాని ద్వారా ఎవ్వరూ నరుని నుండి నారాయణునిగా అవ్వరు. అంటే ఆ కథ అసత్యమైనది కదా. ఇక్కడ మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే కూర్చున్నారు. పవిత్రంగా అవ్వండి, నన్నొక్కడినే స్మృతి చేయండి అని వారు ఇలా చెప్పరు. సత్యనారాయణ కథను పౌర్ణమి రోజున వినిపిస్తారు. ఇప్పుడు ఈ సమయంలో 16 కళల చంద్రుడిని పౌర్ణమి అని అంటారు. చివరికి, చంద్రుడు ఒక గీత వలె ఉంటాడు, దానిని అమావాస్య అని అంటారు. అమావాస్య అనగా అంధకారమయమైన రాత్రి. సత్య, త్రేతా యుగాలను పగలు, ద్వాపర కలియుగాలను రాత్రి అని అంటారు. ఈ పాయింట్లన్నీ అర్థం చేసుకోవాల్సినవి. ఇవన్నీ శివబాబా కూర్చుని చదివిస్తారు. వారు తండ్రి కూడా, టీచరు కూడా మరియు గురువు కూడా. వీరిలో ప్రవేశించి ఆత్మలను చదివిస్తారు.

తండ్రి అంటారు – ఎలాగైతే వీరి ఆత్మ భృకుటి మధ్యలో కూర్చుందో, నేను కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటాను. కూర్చుని మీకు అర్థం చేయిస్తాను. మీరు ముందు పావనంగా ఉండేవారు, తర్వాత పతితంగా అయ్యారు. ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వకుండా తిరిగి ఇంటికి వెళ్ళలేరు. పవిత్రంగా అయినప్పుడే ఎగురుతారు. అందరూ పిలుస్తారు కూడా – ఓ పతితపావనా రండి, పావనంగా తయారుచేయండి, అప్పుడే మేము ఎగరగలుగుతాము, మా ఇల్లు అయిన ముక్తిధామానికి వెళ్ళగలుగుతాము అని. అది ఆత్మలైన మన ఇల్లు. పతితులు ఆ ఇంటికి వెళ్ళలేరు. ఎవరైతే మంచి రీతిగా శిక్షణలను ధారణ చేస్తారో, వారు స్వర్గంలోకి త్వరగా వస్తారు లేదంటే ఆలస్యంగా వస్తారు. కొత్త ఇంటిలోకి రావాలి కదా. కొత్త ఇంటిలో మజా ఉంటుంది కదా. మొట్టమొదట సత్యయుగంలోకి రావాలి. మమ్మా-బాబా సత్యయుగంలోకి వెళ్తారు, మరి మనం ఎందుకు ఆలస్యంగా వెళ్ళాలి! మీరు కూడా బ్రహ్మాను ఫాలో చేయండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఏ విషయంలోనైనా కష్టమనిపిస్తే శివబాబాను అడగండి. శ్రీమతంతోనే శ్రేష్ఠంగా అవుతారు. పాత ప్రపంచంలో 5 వికారాల రూపీ రావణుని మతాన్ని అనుసరిస్తూ వచ్చారు. మొట్టమొదటిది దేహాభిమానము. ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. ఆత్మనైన నేను పరంధామ నివాసిని. దానిని శాంతిధామమని అంటారు. ఇలాంటి విషయాలను ఇతురులెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. మీ ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా వింటుంది. సత్యయుగంలో శరీరం ఎప్పుడూ అసలు పాడవ్వదు. ఇక్కడైతే కూర్చుని-కూర్చునే అకాల మృత్యువు జరుగుతుంది. సత్యయుగంలో ఇలాంటి విషయాలేవీ ఉండవు. దానినే హెవెన్, స్వర్గం, ప్యారడైజ్ అని అంటారు. మళ్ళీ మనం చక్రం తిరిగి పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము. మళ్ళీ తండ్రి వచ్చి పిల్లలను స్వర్గానికి యోగ్యులుగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచానికి యోగ్యులుగా అయ్యారు. ఇప్పుడిది నరకము. ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యే భాగ్యాన్ని తయారుచేసుకోవడానికి వచ్చారు. మేము శివబాబా వద్దకు భాగ్యం తయారుచేసుకోవడానికి వచ్చామని అంటారు. కల్ప-కల్పము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మనం భాగ్యం తయారుచేసుకుంటాము. మనం స్వర్గవాసులుగా అవుతాము, తర్వాత రావణ రాజ్యం మొదలవ్వడంతో మనం వికారులుగా అవుతాము. ఇప్పుడు అందరూ వికారులుగా, పతితులుగా ఉన్నారు, అందుకే వారు వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. కొత్త ప్రపంచంలో కేవలం పిల్లలైన మీరు మాత్రమే ఉంటారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. పైన ఆత్మల వృక్షముంది. తర్వాత తమ-తమ సమయాలలో వస్తారు. మన రాజ్యమున్నప్పుడు అక్కడ ఇతర ధర్మాలవారు ఉండరు. మళ్ళీ ద్వాపరంలో రావణ రాజ్యం మొదలవుతుంది. ఈ విషయాలన్నింటినీ మంచి రీతిగా ధారణ చేయాలి. ఇక్కడ నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారవ్వాలి. నరకవాసులైన మనుష్యులను అసురులని మరియు స్వర్గవాసులైన మనుష్యులను దేవతలని అంటారు. ఇప్పుడు అందరూ ఆసురీ స్వభావం కలవారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పురుషార్థం చేయిస్తారు. తండ్రి అంటారు – పవిత్రంగా అవ్వండి, ప్రతి విషయంలో అడుగుతూ ఉండండి. కొంతమంది అడుగుతారు – బాబా, వ్యాపారంలో అబద్ధం చెప్పవలసి వస్తుంది. అబద్ధం చెప్పడం వలన కొంత పాపం తయారవుతుంది. మళ్ళీ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో ప్రపంచంలో అందరూ పాపాలు చేస్తూ ఉంటారు. ఎన్ని లంచాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రదర్శనీ చిత్రాలు మ్యాపుల వంటివి. ఇలాంటి మ్యాపులు ఎక్కడా ఉండవు. ఒకవేళ ఎవరైనా వాటిని చూసి కాపీ చేసి తయారుచేసినా కూడా, వాటి అర్థాన్ని ఏమీ తెలుసుకోలేరు. ప్రదర్శనీ, మేళాలకు చాలామంది వస్తారు. వారితో ఇలా చెప్పడం జరుగుతుంది – 7 రోజుల కోసం అర్థం చేసుకోవడానికి వచ్చినట్లయితే మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు యోగ్యులుగా అవుతారు. ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు, మెట్ల చిత్రంలో చూడండి ఎంత స్పష్టంగా ఉంది. ఇది పతిత ప్రపంచ, పావన ప్రపంచం పైన ఉంది.

ఇప్పుడు పిల్లలైన మీరు శివబాబాకు ప్రతిజ్ఞ చేస్తారు – బాబా, మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తప్పకుండా అవుతాము. ఇప్పుడు మీరు శివాలయంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు, అందుకే వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళకూడదు. తుఫాన్లు అయితే మాయకు సంబంధించినవి చాలానే వస్తాయి, కానీ వివస్త్రగా (పతితం)గా అవ్వకూడదు. పతితంగా అవ్వడం వలన పెద్ద తప్పు జరుగుతుంది, అప్పుడు ధర్మరాజు ద్వారా చాలా పెద్ద శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడానికి ఆసురీ స్వభావము ఏదైతే ఉందో, అబద్ధం చెప్పే అలవాటు ఏదైతే ఉందో, దానిని త్యాగం చేయాలి. దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి.

2. ఇంటికి వెళ్ళేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. మాయా తుఫాన్లు వచ్చినా కూడా, కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎలాంటి వికర్మలు చేయకూడదు.

వరదానము:-

సంపూర్ణ విశ్వాసపాత్రులు అని ఎవరిని అంటారంటే – ఎవరి సంకల్పం మరియు స్వప్నంలో కూడా కేవలం తండ్రి మరియు తండ్రి కర్తవ్యం లేక తండ్రి మహిమ, తండ్రి జ్ఞానం తప్ప ఇంకేదీ కనిపించదో, వారిని. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు….. బుద్ధి యొక్క లగనము సదా ఒక్కరి సాంగత్యంలోనే ఉంటే అనేక సాంగత్యాల రంగు అంటుకోదు. అందుకే, మొదటి ప్రతిజ్ఞ – ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తాను – ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం అనగా సంపూర్ణ విశ్వాసపాత్రులుగా అవ్వడము.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top